దండేపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి బస్తాలను మిల్లులు, గోదాంలకు ఎప్పటికప్పుడు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులు, నిర్వాహకులకు సూచించారు. శనివారం ఆయన మండలంలోని కన్నెపల్లి, గూడెం, నంబాల, వెల్గనూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల అధికారులతో కలిసి సందర్శించారు. తూకం వేసే తీరు, బస్తాల తరలింపు, గన్నీ సంచులు సరిపడా ఉన్నాయా లేదా అనే వాటిపై ఆరా తీశారు. వెల్గనూర్‌లో వరుసక్రమం పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా తూకం వేస్తున్నారని, బస్తాలు తరలిస్తున్నారని పలువురు రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలా చేస్తే ఉపేక్షించేది లేదని నిర్వాహకులను మందలించారు. తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
గోదాం పరిశీలించిన ఏసీపీ..
మండలంలోని లింగాపూర్ సమీపంలో వరి ధాన్యం నిల్వ గోదాంను మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ శనివారం పరిశీలించారు. గోదాం నిర్వాహకులతో మాట్లాడారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సీఐ రమణమూర్తి, ఎస్సై తహాసీనొద్దీన్ ఉన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
లక్సెట్టిపేట: ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఐదవ, 12వ వార్డులు పరిశీలించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


