మంచిర్యాలక్రైం: ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఇంట్లో పనిలో పెట్టుకున్నా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు సేకరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో స్థానిక సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రతీ ఇంట్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేటు, ప్రతాలు లేని వాహనాలను సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆధార్‌కార్డు తదితర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. గంజాయికి బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్‌కు పంపించాలని అన్నారు. మహిళల భద్రతకు షీ టీమ్, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలు హింస, వేధింపులకు గురైతే 100 డయల్‌కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావు, రమణమూర్తి, ఆకు ల అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, కార్పొరేటర్లు నల్ల శంకర్, పూదారి ప్రభాకర్, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.


