కొత్త కోడళ్ల భేటింగ్
గంగాజలంతో దేవతకు అభిషేకం
మహాపూజతో జాతర ప్రారంభం
మెస్రం వంశ కొత్త కోడళ్ల భేటింగ్
ప్రతిబింబించిన ఆదివాసీ సంస్కృతి
భారీగా తరలివచ్చిన వంశీయులు
భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం
నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానివ్వబోమని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. ఆదివారం నాగోబా ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మెస్రం వంశీయులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. జాతర నిర్వహణ స్థలం, మెస్రం వంశీయులు బస చేసిన గోవడ్ స్థలాన్ని సందర్శించారు. భక్తులు తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, దేవాదాయశాఖ ఈవో ముక్త రవి, ఇతర అధికారులున్నారు.
కొత్తపుట్టల తయారీకి ఆవుపేడ, పవిత్ర కోనేరు జలంతో ఆలయంలోకి వస్తున్న మెస్రం వంశ మహిళలు
ఇంద్రవెల్లి: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి మెస్రం వంశీ యులు ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ పూ జలు నిర్వహించారు. ముందుగా కేస్లాపూర్‌లో ని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలీకోమ్, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం సంప్రదాయ పూజలు నిర్వహించారు.
కోనేరులో పవిత్రజలం సేకరించి..
సంప్రదాయ పూజల్లో భాగంగా మెస్రం వంశీయులు సిరికొండ కొత్త కుండలకు పూజలు చేశారు. అనంతరం 22కితల వారీగా మహిళలు, ఆడబిడ్డలు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండలు స్వీకరించారు. వంశ అల్లుళ్లు, ఆడబిడ్డలు కొత్త కుండలతో మర్రిచెట్టు వద్ద ఉన్న కోనేరుకు చేరుకున్నారు. కోనేరులో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకువచ్చారు. సంప్రదాయ పూజ సమయంలో పర్ధాన్ కితకు చెందిన మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయించగా ఆలయం పక్కనగల పాత మట్టి పుట్టలను వంశ అల్లుళ్లు తొలగించారు. ఆ మట్టితో ఆడబిడ్డలు తిరిగి కొత్త పుట్టలు తయారు చేశారు. పుట్ట మట్టిని ఉండలుగా సేకరించి నాగోబా ఆలయం పక్కనే గల సతి ఆలయం ఎదుట ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు నిర్వహించిన పూజలను ఐటీడీఏ పీవో యువరాజ్‌మర్మాట్ ఆసక్తిగా తిలకించా రు. పూజలు సాయంత్రం వరకు కొనసాగాయి.
వైభవంగా మహాపూజ
సంప్రదాయ పూజల అనంతరం రాత్రి 9నుంచి 10.30 గంటల వరకు పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించారు. (ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులను అనుమతించలేదు) మహాపూ జ అనంతరం హాజరైన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మహాపూజ హారతి స్వీకరించి నాగోబా జాతర ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. నాగోబా మహాపూజకు ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు, భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. దీంతో నాగోబా ఆలయ పరిసర ప్రాంతం జనసంద్రంగా మారింది.
హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
నాగోబా మహాపూజలో ఎంపీ గోడం నగేశ్, ఖానా పూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్‌జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు భేటింగ్ (పరిచయం) నిర్వహించారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని సుమారు వందమందికి పైగా మెస్రం వంశ కొత్త కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి భేటింగ్‌కు హాజరయ్యారు. ముందుగా వంశ మహిళల సహకారంతో సతి దేవత, నాగోబా ఆలయంలో కొత్త కోడళ్లతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కొత్త కోడళ్లు ఆలయం ఎదుట వరుసగా కూర్చున్న వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. భేటింగ్ ద్వారా కొత్తకోడళ్లు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు భావించారు. కాగా, భేటింగ్ పూర్తి కావడంతో తమ జన్మ ధన్యమైందని కొత్తకోడళ్లు నాగోబాకు
మొక్కుకున్నారు.
కొత్త కోడళ్ల భేటింగ్


