అదృష్టవంతులెవరో..!
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి కార్పొరేషన్‌గా మంచిర్యాలను గతేడాది జనవరి 27న ఏర్పాటు చేశారు. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు, హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి 60 డివిజన్లుగా విభజించారు. మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్తగా మరికొందరు తెరమీదకు వచ్చారు. రిజర్వేషన్లు అనుకూలిస్తాయో లేదోనని ఇన్నాళ్లు ఎదురుచూశారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి ఏ డివిజన్ ఎవరికి కేటాయించారనే దానిపై స్పష్టత వచ్చింది. 60 డివిజన్లలో ఎస్టీలకు 1, ఎస్సీలకు 9 (4 మహిళలు, 5 జనరల్), బీసీలకు 20 (10 మహిళలు, 10 జనరల్), జనరల్ స్థానాలు 30 (16 మహిళలు, 14 జనరల్) కేటాయిస్తూ కలెక్టర్ ఈ నెల 17న రిజర్వేషన్లను ప్రకటించారు. వీటితో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటిసారిగా మేయర్ పదవి బీసీ జనరల్‌కు కేటా యించారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 20 డివిజన్లను కేటాయించారు. ఆయా డివిజన్లకు చెందిన మహిళలు, పురుషుల్లో ఒకరికి మేయర్ పదవి లభించే అవకాశం ఉంది. మొదటి కార్పొరేటర్‌గా గెలుపొందాలని ప్రతిఒక్కరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా ఎలాగైనా మేయర్ పదవిని చేపట్టాలని 20 డివిజన్లలో పోటీ చేసే బీసీ ఆశావహులు అంతే ఆశతో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఆయా డివిజన్లలో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలనే మూడు ప్రధాన పార్టీలు నిర్ణయించుకోగా తమకు టికెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంటుగానైనా పోటీ చేయాలని పలువురు అభ్యర్థులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


