● పంచాయతీల్లో కోఆప్షన్‌పై ఆశలు ● ఎంపికలో ఎమ్మెల్యే, సర్
ఆ ముగ్గురు ఎవరో..?
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీల్లో పా లకవర్గ సభ్యులు కొలువుదీరి పల్లెపాలనకు శ్రీకా రం చుట్టారు. ఇక మిగిలింది కోఆప్షన్ సభ్యుల ఎంపిక మాత్రమే.. వార్డు సభ్యులతో సమాన హోదా ఉండటంతో ఆశావహుల దృష్టి కోఆప్షన్‌లపై పడింది. వీరితో పాటు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. నూతన పంచాయతీ రాజ్– 2018 చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ముగ్గురు కోఆప్షన్ సభ్యులు ఉంటారు. వీరికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. వీరి ఎంపికలో సర్ప ంచ్, ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరిస్తారు. కోఆప్షన్ ఎన్నికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రామాల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపికపై కసరత్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ముగ్గురు చొప్పున ఎంపిక..
జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉండగా 302 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. రాజారాం జీపీ లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నెల్కి వెంకటాపూర్, వందూరుగూడలో ఎన్నికలు జరగలేదు. గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున 303 జీపీలకు 909 మంది కోఆ ప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. వారిని పంచాయతీ సమావేశాలకు, గ్రామసభలకు ఆహ్వానించాల్సి ఉంటుంది. వార్డు సభ్యులకు ఉండే విధులు, హోదా ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో, జిల్లా, మండల పరిషత్‌లలో కోఆప్షన్‌లుగా మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ పంచాయతీల్లో కోఆప్షన్‌ల ఎంపిక మాత్రం భిన్నంగా ఉంటుంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిని తప్పకుండా నియమించాలి. అలాగే పంచాయతీ భవన స్థల దాతకు అవకాశం కల్పించాలి. లేనిపక్షంలో గ్రామానికి సేవ చేసే వారిలో ఎవరినైనా నియమించుకోవచ్చు.
ఎంపికపై ఆసక్తి
జిల్లాలో కాంగ్రెస్ 183, బీఆర్‌ఎస్ 59, బీజేపీ 9, సీపీఐ 1, ఇతరులు 50 మంది సర్పంచులుగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులే ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ మద్దతుదారులకే కోఆప్షన్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పదవీ విరమణ ఉద్యోగులు, సమాఖ్య అధ్యక్షులు లేని గ్రామాల్లో ఎంపిక ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే పంచాయతీల మొదటి సమావేశంలోనే కోఆప్షన్‌ల ఎంపిక జరగాల్సి ఉండగా సందడిలో వీలు కానిపక్షంలో రెండో సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది. మొత్తంగా కొత్త సంవత్సరంలో జనవరి చివరి వరకు కోఆప్షన్ పదవుల ఎంపిక సందడి ఉండబోనున్నట్లు తెలుస్తోంది.


