రిజర్వేషన్లపై కసరత్తు!
వార్డులు కేంద్రాలు
నేడు వార్డులవారీగా కేటాయింపు ఇక నోటిఫికేషన్ జారీనే ఆలస్యం ఆశావహుల్లో మొదలైన హడావుడి తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూపులు
మంచిర్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను విడుదల చేసిన అధికారులు డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లు ప్రకటించారు. డివిజన్లు/వార్డుల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2011 జనాభా ఆధారంగా ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించనున్నారు. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే గణాంకాల ప్రాతిపదికన, డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మారనున్న రిజర్వేషన్లు
జిల్లాలో గతంలో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. మంచిర్యాల, నస్పూరు, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్‌కు 2020లో జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు జరిపించారు. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ కొత్తగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. దీంతో మంచిర్యాల కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. 60 డివిజన్లలో రిజర్వేషన్లు ప్రకటించడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మిగతా మున్సిపాలిటీలైన బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్‌లో మాత్రం 2020లోని రిజర్వేషన్లు మరోసారి పునరావృతం కాకుండా చేపట్టాల్సి ఉంది. గతంలో వచ్చిన రిజర్వేషన్లు మారి కొత్త రిజర్వేషన్లు వచ్చే అవకాశముంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదటిసారి ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఎలా వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. గతంలో వార్డు కౌన్సిలర్లుగా పనిచేసిన వారు, ప్రస్తుతం డివిజన్లుగా మారి వారి ఏరియా పరిధి పెరగడంతో తమకే ఆయా పార్టీలు టికెట్లు కేటాయిస్తాయనే నమ్మకంతో ఇంటింటా ప్రచారాన్ని మొదలు పెట్టారు. రిజర్వేషన్లు వారికి అనుకూలంగా రాకపోతే ఏమి చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌కు మొదటిసారి కార్పొరేటర్లుగా కావాలనే ఆశావహుల సంఖ్య పెరగడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఇప్పటికే ప్రతీ డివిజన్‌కు ముగ్గురు నుంచి ఆరుగురు నాయకులు పార్టీ టికెట్లుఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మున్సిపాలిటీలవారీగా వార్డులు, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు
మున్సిపాలిటీ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు
మంచిర్యాల 60 265 1,81,778
బెల్లంపల్లి 34 68 44,575
చెన్నూరు 18 36 19,903
క్యాతన్‌పల్లి 22 45 29,785
లక్సెట్టిపేట 15 30 18,331


