టేకుచెట్లపై గొడ్డలి వేటు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లోని తాళ్లపేట, జన్నారం, ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లలో విలువైన టేకు సంపదను స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. జన్నా రం అటవీ రేంజ్ పైడిపెల్లి బీట్ ఈర్లగుట్ట సమీపంలో సుమారు 20వరకు టేకుచెట్లు ఈనెల 13న నరికి కలప తరలించుకుపోయినట్లు తెలుస్తోంది. విష యం జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో బీట్ పర్యవేక్షణ చే యించినట్లు సమాచారం. ప్రధాన రహదారికి సు మారు రెండు కిలోమీటర్ల దూరంలోనే చెట్లు నరికివేతకు గురి కావడం అటవీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందనే ఆరోపణలున్నాయి. ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లో ఇటీవల పట్టుకున్న రూ.60వేల విలువైన 11 టేకు దుంగలను పరిశీలిస్తే చెట్లు నరికి తరలించేందుకు గడ్డివాములో దుంగలు నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఇందన్‌పల్లి రేంజ్ పరి ధిలోనే చెట్లు నరికివేసి కలపను రహస్యంగా వాహనంలో తరలించి నిల్వ ఉంచినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ కలపను గోదావరి దాటించే ప్రయత్నం జరుగుతుండగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే నిల్వ ఉంచినట్లు అధికారులకు తెలిపారు. ఇలా డివిజన్ పరిధిలో వారం వ్యవధిలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
నిల్వ చేసిన కలప స్వాధీనం
తాళ్లపేట్ రేంజ్‌లో అటవీ అధికారులు ఇటీవల విశ్వసనీయ సమాచారం మేరకు తపాలపూర్ గ్రామంలో రెండు ఇళ్లలో దాడి చేసి నిల్వ ఉంచిన రూ.40వేల కలప పట్టుకున్నారు. కొన్ని నెలలుగా ఆగిన కలప అక్రమ రవాణా తిరిగి ప్రారంభమైనట్లు పలు ఘటనల ద్వారా తెలుస్తోంది.
విచారణ చేపట్టాం
పైడిపెల్లి బీట్‌లో టేకు చెట్లు నరికివేసినట్లు సమాచారం రాగానే అక్కడికి వెళ్లి పరిశీలించాం. దీనిలో ఎవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ చేపట్టాం. రాత్రి, పగలు పెట్రోలింగ్ నిర్వహిస్తూ కలప స్మగ్లింగ్‌ను నిరోధించాం. ఇటీవల నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించడంతోనే కొందరు బురద చల్లడానికి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో


