ఓటరు జాబితా తప్పుల తడక
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ నెల ఒకటిన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. ఒక డివిజన్ ఓటర్లను మరో డివిజన్‌లో చేర్చారంటూ అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూర్ మున్సిపాల్టీతోపాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్‌గా గత ఏడాది జనవరిలో ఏర్పాటు చేయడం, 60 డివిజన్లుగా విభజించడం తెలిసిందే. ఒక్కో డివిజన్‌లో 1800 నుంచి 4వేల మంది ఓటర్లు ఉండేలా ప్రాంతం ఆధారంగా విభజించారు. కొన్ని డివిజన్లలో తక్కువ ఓటర్లు నమోదు కాగా, మరికొన్ని డివిజన్లలో 3,800 మంది వరకు ఉన్నారు. డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో భారీగా తేడాలు ఉండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నివాసం ఓ చోట.. ఓటు మరోచోట
నగరంలో 1,82,029 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 90,757మంది, మహిళలు 91,251 మంది, ఇతరులు 21మంది ఉన్నారు. 254 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 42వ డివిజన్‌లో 1,883మంది ఓటర్లు మాత్రమే ఉండగా.. 49వ డివిజన్‌లో అత్యధికంగా 3,823 మంది ఉన్నారు. ఒకే ఇంట్లోని ఓటర్లు ఒకే డివిజన్‌లో కాకుండా వేర్వేరు డివిజన్లలోకి వచ్చినట్లు ఓటర్లు గుర్తించారు. ఒక డివిజన్‌లో నివాసం ఉంటే మరో డివిజన్‌లో ఓటు హక్కు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తుండగా.. మొద టి రోజు శుక్రవారం 11 అభ్యంతరాలు వచ్చాయి. డివిజన్ ఒకటైతే ఓటు హక్కు మరో డివిజన్‌లో కల్పించడం, అత్యధికంగా ఓటర్లు ఉండేలా కొన్ని డివిజన్లు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఇంటి నంబర్లలో కొన్ని నస్పూరుకు చెందిన ఓటర్లు, మంచిర్యాలలోకి చేర్చినట్లుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితాపై శుక్రవారం ఇద్దరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 20వ వార్డులోని ఓ ఓటరు తన పేరును 21వ వార్డు నుంచి 20వ వార్డు పరిధిలో చేర్చాలని, 34 వార్డు ఓటరు జాబితాలో ఉన్న తన పేరును 33వ వార్డులోకి మార్చాలని మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు.
వార్డు మార్చాలని వినతి


