ఇక్కడ ప్రతి సామాజిక వర్గానికి ఒక బాధ్యత.. ప్రతి వృత్తికి ఒక పవిత్రత.. ప్రతి సేవకు ఒక ప్రత్యేకత ఉంది. తోలుతో పాదుకలు తయారు చేసే చేతుల నుంచి వెదురుతో చాట అల్లే నైపుణ్యం వరకు, మట్టితో కుండలు మలిచే వృత్తి నుంచి పల్లకీ మోసే శ్రమ వరకు.. అన్నీ స్వామివారి సేవలో అంతర్భాగాలే. ఎవరి వృత్తి చిన్నది కాదు.. ఎవరి సేవ తక్కువ కాదు అనే సందేశాన్ని ఈ సంప్రదాయం చాటుతోంది. సమాజంలో వృత్తుల ఆధారంగా వివక్షకు గురైన వర్గాల నైపుణ్యాలనే దేవుడి సేవకు అత్యంత అవసరమైనవిగా గుర్తించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా ఉద్దాల సంప్రదాయంలో మాదిగ కుటుంబాలకు దక్కుతున్న గౌరవం సామాజిక మార్పునకు అద్దం పడుతోంది. తరతరాలుగా కొనసాగుతున్న వృత్తులు కేవలం జీవనోపాధి సాధనాలే కాకుండా ఆధ్యాత్మిక సంపదలో భాగమని నిరూపిస్తోంది. అందుకే కురుమూర్తి క్షేత్రం కేవలం మొక్కులు తీర్చుకునే పుణ్యస్థలంగా మాత్రమే కాకుండా.. శ్రమకు గౌరవం, వృత్తికి పవిత్రత, మనిషికి సముచిత స్థానం కల్పించే సమతా వేదికగా నిలుస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా, పేదల తిరుపతిగా పేరొందిన ఈ క్షేత్రం పాలమూరు సామాజిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా విరాజిల్లుతోంది.


