కురుమూర్తి జాతరలో మరో విశేషం వివిధ కులవృత్తుల వారు తమ సంప్రదాయ నైపుణ్యాలతో స్వామివారి సేవలో భాగస్వాములు కావడం. పల్లమర్రి గ్రామానికి చెందిన మేదరులు ఉద్దాలను పవిత్రంగా తీసుకెళ్లేందుకు అవసరమైన చాటను ప్రత్యేక శ్రద్ధతో అల్లి అందిస్తారు. ముదిరాజులు పల్లకీ సేవల్లో పాల్గొంటూ స్వామివారి ఉత్సవాలకు భుజబలాన్ని అందిస్తారు. శాతవాహనులుగా గుర్తింపు పొందిన వర్గానికి చెందిన వారు నైవేద్యాలు, దాసంగాల తయారీకి అవసరమైన మట్టి కుండలను రూపొందిస్తారు. ఆ కుండల్లోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కురుమూర్తి గ్రామ పద్మశాలీలు గుట్టపై దీపం వెలిగించే బాధ్యతను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మాల దాసరులు పూజా సేవల్లో భాగస్వాములవుతున్నారు. రజకులు ఉత్సవ మడి, దివిటి సంప్రదాయాలకు సంబంధించిన సేవలను నిర్వహిస్తున్నారు. కురుమూర్తి కాపులు, రెడ్లు పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతల్లో పాలుపంచుకుంటుండగా.. నంబి పూజారులు ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా స్వామివారి పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.


