మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తూ, వారికి తగు న్యాయం చేస్తామని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జడ్జి అనురాధ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక మాక్స్ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు లేదా రశీదు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ వస్తువు నకిలీ అయినా, కాలం చెల్లినా, ధరలో మోసం జరిగినా వెంటనే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాలన్నారు. ఫైనాన్స్ ఉన్న వాహనం గాని, వస్తువు గాని ఫైనాన్షియర్ నోటీసు ఇవ్వకుండా జప్తు చేయడానికి వీలు లేదన్నారు. ఇప్పటికే జాన్సన్ ప్రొడక్ట్‌లను పూర్తిగా నిషేధించారని, ఆ కంపెనీ వస్తువులు అమ్మడం నేరమని, వాటిని ఎవరూ కొనుగోలు చేయరాదన్నారు. డీసీఎస్‌ఓ గంపా శ్రీనివాస్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సభ్యులు జి.సత్యనారాయణరెడ్డి, కె.చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, సీఏటీసీఓ డి.గోపాల్ నారాయణ, న్యాయవాది ఆడమ్స్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జడ్జి అనురాధ


