విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Nov 29 2026 2:29 PM | Updated on Nov 29 2026 2:29 PM

● పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలోతనిఖీలు చేపట్టాలి

● నేటి ఎస్‌ఐ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ డి.జానకి

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న ఎస్‌ఐ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 10,653 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. పరీక్ష బందోబస్తు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, సమన్వయంతో పరీక్ష నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పరేడ్‌ మైదానంలో ఎస్‌ఐ రాత పరీక్ష బందోబస్తు విధుల కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలకు విధులు కేటాయించిన సిబ్బంది ముందుగానే చేరుకోవాలని సూచించారు. కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, సమయపాలనతో నిర్వహించాలన్నారు. కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష ముగిసే వరకు బందోబస్తు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. అనుమానాస్పద సంఘటనలు, మాల్‌ప్రాక్టీస్‌ ప్రయత్నాలు గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, పరిసర ప్రాంతాల్లో సెక్షన్‌ 163ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల పరిశీలన

నగరంలోని పరీక్ష కేంద్రాలను శనివారం డీఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించారు. కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అభ్యర్థులకు తాగునీరు, సరైన బెంచీలు, ఇతర వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement