జడ్చర్ల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తే రైతులకు పడిగాపులే మిగులుతున్నాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శనివారం టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడం, అనంతరం హమాలీలు, దడవాయిలు రాత్రి వేళ తూకాలు వేసేందుకు నిరాకరించడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల బస్తాల పంట ఉత్పత్తులతో వచ్చిన రైతులు యార్డులోనే ఉండిపోవాల్సి వచ్చింది. మార్కెట్‌లో మధ్యాహ్నం ఒంటి గంటలోగా ఖరీదుదారులు టెండర్లు వేసి ధరలు ప్రకటించాల్సి ఉంది. అయితే లారీ యజమానులు రవాణా చార్జీలు పెంచడంతో ఖరీదుదారులతో విభేదాలు తలెత్తాయి. దీంతో వారు టెండర్లు వేయకుండా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి అశ్వక్ అహ్మద్ ఖరీదుదారులతో చర్చించి టెండర్లు వేయాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటల తర్వాత ధరలు ప్రకటించారు. అప్పటికే ఆలస్యం కావడంతో రాత్రి వేళ బస్తాల్లో పంట నింపడం, తూకాలు వేయడం సాధ్యం కాదని హమాలీలు, చాటకూలీలు, దడవాయిలు స్పష్టం చేశారు. కుటుంబ బాధ్యతలు, రాత్రివేళ ఎదురయ్యే ప్రమాదాల నేపథ్యంలో పగటిపూట మాత్రమే పనులు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో తూకాలు నిలిచిపోయి రైతులు యార్డులోనే ఉండిపోయారు.
రైతుల ఆగ్రహం.. నేడు తూకాలు
టెండర్ల ఆలస్యం, హమాలీలు, దడవాయిలు, కూలీల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పంట దిగుబడులను విక్రయించేందుకు వచ్చామని, ఇక్కడికి వచ్చిన తర్వాత క్రయవిక్రయాలు నిలిపివేయడం ఏమిటని మార్కెట్ అధికారులను నిలదీశారు. సాయంత్రానికే ఇళ్లకు చేరుకుని పాడి పశువులు, ఇతర వ్యవసాయ పనులు చూసుకోవాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, ఖరీదుదారులు, హమాలీలు వ్యవహరించిన తీరు సరికాదని వాపోయారు. అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని కొందరు రైతులు కార్యదర్శితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాగా.. టెండర్లు ఆలస్యం కావడంతో హమాలీలు, దడవాయిలు వెళ్లిపోయారని, దీంతో తూకాలు నిలిచిపోయాయని మార్కెట్ కార్యదర్శి అశ్వక్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం తూకాలు నిర్వహిస్తామని తెలిపారు.
బాదేపల్లిలో ఆలస్యంగా టెండర్లు.. నిలిచిన తూకాలు
ఖరీదుదారులు, లారీ యజమానుల మధ్య విభేదాలతో జాప్యం
రాత్రి వేళ పనిచేయబోమన్న హమాలీలు.. యార్డులోనే రైతుల నిరీక్షణ


