దాదాపు 120 ఏళ్లుగా ఎందరికో నీడనిస్తూ.. అలసిన బాటసారులకు సేదతీరుస్తూ.. తరత రాల జ్ఞాపకాలకు సాక్షిగా నిలిచిన ఆ మహావృక్షం ఇక కనుమరుగుకానుంది. కల్వకుర్తి బస్టాండ్ సమీపంలో నిటారుగా నిలబడి ప్రయాణికులకు ఆత్మీయ నీడనిచ్చిన వేపచెట్టు అభివృద్ధి పనుల్లో భాగంగా నేలకొరుగుతోంది. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉండటంతో అధికారులు చెట్టును తొలగిస్తున్నారు. ఒకప్పుడు బస్టాండ్‌కు బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు ఈ వేపచెట్టే పెద్ద దిక్కు. మండుటెండలో బస్సు కోసం ఎదురుచూసే వారికి చల్లని నీడనిస్తూ సేదతీర్చేది. కాలంతోపాటు ఎన్నో మార్పులు చూసిన ఈ చెట్టు.. వందలాది మంది ప్రయాణికుల జ్ఞాపకాల్లో భాగమైంది. చెట్టును ఆను కుని కొందరు చిరు వ్యాపారులు ఏళ్ల తరబడి తమ జీవనోపాధిని సాగించారు. అయితే కాలం మారింది.. అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి.రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పుడు ఆ చెట్టును తొలగిస్తుండటంతో 120 ఏళ్ల చరిత్రకు తెరపడుతోంది.రహదారి విస్తరణతో సౌకర్యాలు పెరగనున్నా.. తరతరాలకు నీడనిచ్చిన ఆ వేపచెట్టు మాత్రం ఇక కనిపించదు. నిన్నటి వరకు ఎందరికో ఆసరాగా నిలిచిన మహావృక్షం.. నేడు మౌనంగా వీడ్కోలు పలుకుతోంది. – కల్వకుర్తి రూరల్


