కన్నీళ్లను మిగిల్చిన రాఖీ పండుగ | - | Sakshi
Sakshi News home page

కన్నీళ్లను మిగిల్చిన రాఖీ పండుగ

Sep 1 2026 1:25 AM | Updated on Sep 1 2026 1:25 AM

రాఖీ కట్టేందుకు వెళ్తూ..

సోదరులకు రాఖీ కట్టి వస్తుండగా.. లారీ కిందపడి మహిళ మృతి

రాఖీ కట్టేందుకు వెళ్తూ బైక్‌ అదుపుతప్పి మరో మహిళ దుర్మరణం

రెండు కుటుంబాల్లో విషాదం.. ముగ్గురు చిన్నారులకు తల్లి దూరం

మహబూబ్‌నగర్‌ క్రైం/ఉండవెల్లి: రాఖీ పండుగ అంటే సోదరుడి క్షేమాన్ని కోరుతూ సోదరి కట్టే ప్రే మబంధం. కానీ ఈసారి ఆ రాఖీనే రెండు కుటుంబాలకు కన్నీటి జ్ఞాపకంగా మిగిలింది. సోదరుల చేతికి రాఖీ కట్టి తిరిగి వస్తున్న స్వాతి.. సోదరులకు రాఖీ కట్టేందుకు బయలుదేరిన సుశీలమ్మ.. ఇద్దరి ప్రయాణాలు విషాదాంతమయ్యాయి. ఒక ఇంట్లో చిన్నారులు అమ్మ కోసం ఎదురుచూస్తుంటే.. మరో ఇంట్లో సోదరి కోసం ఎదురుచూసిన అన్నదమ్ముల కు ఆమె ఇక కనిపించని లోకాలకు వెళ్లిపోయిందన్న చేదు నిజం మిగిలింది. రాఖీ పండుగ తెచ్చిన ఆనందం కంటే.. ఈ రెండు కుటుంబాల్లో మిగిల్చిన విషాదమే బరువెక్కింది. వివరాల్లోకి వెళితే..

రాఖీ కట్టి వస్తుండగా.. మృత్యువు కబళించి..

మహబూబ్‌నగర్‌లోని అన్నదమ్ములకు రాఖీ కట్టి భర్తతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరిన స్వాతి(26)కు అదే చివరి ప్రయాణమైంది. దేవరకద్ర పట్టణంలోని కుర్వగేరికి చెందిన క్రిష్ణ, స్వాతి దంపతులు సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై దేవరకద్రకు బయలుదేరారు. ధర్మపూర్‌ బస్టాండ్‌ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్‌06ఈఎక్స్‌1547 నంబరు గల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను టీఎస్‌12యూఈ0886 నంబరు గల లారీ ఢీకొట్టింది. లారీ వెనుక టైర్ల కింద స్వాతి పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. క్రిష్ణకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

ముగ్గురు చిన్నారులకు తల్లి దూరం

రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములకు రాఖీ కట్టి వస్తే.. ఇంట్లో పిల్లలతో గడపాల్సిన తల్లి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. స్వాతికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురిలో ఒకరు ఎల్‌కేజీ, మరొకరు నర్సరీ, ఇంకొకరు అంగన్‌వాడీకి వెళ్తున్నారు. రాఖీ కట్టిన ఆనందం ఆ కుటుంబంలో ఎంతోసేపు నిలవలేదు. అమ్మ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారులకు ఇక ఆమె జ్ఞాపకాలే మిగిలాయి. ఒకే ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గాయపడిన క్రిష్ణ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం రాత్రి పరామర్శించి ఓదార్చారు.

ఉండవెల్లి మండలంలో మరో విషాదం చోటుచేసుకుంది. సోదరులకు రాఖీ కట్టేందుకు కుమారుడితో కలిసి బయలుదేరిన హరిజన సుశీలమ్మ(51) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన సుశీలమ్మకు కర్నూలు జిల్లా పంచలింగాలలో సోదరులు ఉన్నారు. రాఖీ కట్టేందుకు ఆదివారం కుమారుడు సునీల్‌ బైక్‌పై ఆమెను తీసుకుని బయలుదేరాడు. ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామ శివారులో బైక్‌ అదుపుతప్పడంతో సుశీలమ్మ కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 వాహనంలో కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. సోదరుల చేతికి రాఖీ కట్టాలన్న ఆశతో బయలుదేరిన ఆమె.. వారిని కలవకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతురాలి భర్త హరిజన లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement