కంది పంటలో జాగ్రత్తలు
● పేరపళ్ల, శాసన్‌పల్లి గ్రామాల్లో
శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన
● సమతుల్య ఎరువుల యాజమాన్యంపై
రైతులకు సూచనలు
నారాయణపేట: రైతులు ఎదుర్కొంటున్న పంట సమస్యలకు పొలాల వద్దే శాసీ్త్రయ పరిష్కారాలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే), నారాయణపేట ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయి పర్యటించింది. సోమవారం మండలంలోని పేరపళ్ల, శాసన్‌పల్లి గ్రామాల్లో పత్తి, వరి, కంది పంటలను పరిశీలించారు. టీఆర్‌వీకే నారాయణపేట కోఆర్డినేటర్ డాక్టర్ ఈటెల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏఆర్‌ఎస్ తాండూర్ శాస్త్రవేత్తలు స్వాతి, మాణిక్య మిన్ని పొలాలను సందర్శించారు. వివిధ పంటల్లో కనిపిస్తున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి కారణాలను గుర్తించారు.
పత్తిలో పారావిల్ట్ లక్షణాలు
పత్తి పంటలో కొన్ని ప్రాంతాల్లో పారావిల్ట్ (ఆకస్మిక వడలు) లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి నిర్వహణలో లోపాలు, నేల పరిస్థితులు, పంట ఆరోగ్యం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటను నిరంతరం పరిశీలిస్తూ, సమస్య తీవ్రతను బట్టి తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచించారు.
వరి పొలాల్లో సల్ఫైడ్ ప్రభావం
వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం కొన్ని చోట్ల సల్ఫైడ్ ప్రభావం లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. నీటి యాజమాన్యాన్ని సక్రమంగా పా టిస్తూ, నేల పరిస్థితులకు అనుగుణంగా అవసరమై న చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు.
అధిక ఎరువులతో ప్రయోజనం లేదు
పంటల ఎదుగుదల, అధిక దిగుబడుల కోసం ఎరువులను విచక్షణారహితంగా వినియోగించరాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సిఫారసు చేసిన ఎరువులను సరైన మోతాదులో, సరైన సమయంలో వినియోగించడమే మంచి దిగుబడికి కీలకమని వివరించారు. పంట దశను బట్టి సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలన్నారు.
కంది పంటను సైతం పరిశీలించిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఉన్న ఎదుగుదల పరిస్థితులను బట్టి తగిన యాజమాన్య పద్ధతులు అవలంబించాలని రైతులకు సూచించారు. పంటల్లో ఏవైనా అసాధారణ లక్షణాలు లేదా తెగుళ్ల సమస్యలు కనిపిస్తే వెంటనే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్షేత్ర సందర్శన ద్వారా పొలాల్లోనే సమస్యలు గుర్తించి, వాటికి శాసీ్త్రయ పరిష్కారాలు సూచించడం ద్వారా పంటల ఉత్పాదకతను పెంచేందుకు దోహదపడుతుందని టీఆర్‌వీకే నారాయణపేట కోఆర్డినేటర్ డాక్టర్ ఈటెల సత్యనారాయణ తెలిపారు.


