ఇతర పంటలకూ ప్రోత్సాహం
నీటి పొదుపే మార్గం
● ఈసారి జిల్లాలో 27.9 శాతం లోటు వర్షపాతం
● వరి, పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి
● పండ్లు, కూరగాయలు, పూల తోటలు సాగు చేసేలా ప్రోత్సాహం
● జిల్లావ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో విస్తరణకు
అధికారుల కార్యాచరణ
–8లో u
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వానాకాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికే జిల్లాలో సాధారణం కంటే 27.9 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా.. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రం కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, పత్తి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటల వైపు రైతులు దృష్టిపెట్టేలా ఉద్యానవన శాఖ అప్రమత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళిక’ సిద్ధం చేసి ఉద్యాన పంటల విస్తరణకు శ్రీకారం చుట్టింది.
కార్యాచరణకు శ్రీకారం
వ్యవసాయ శాఖ విడుదల చేసిన ఎల్‌నినో వారపు బులెటిన్ ప్రకారం జూన్ 1 నుంచి ఆగస్టు 30 వరకు జిల్లాలో 380.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 303.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసి.. 20 శాతం లోటు నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలు మరింత తగ్గి బోర్లలో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న 20,300 ఎకరాల ఉద్యాన పంటలకు అదనంగా మరో 6,312 ఎకరాల్లో విస్తరించే లక్ష్యాన్ని ఉద్యాన శాఖ నిర్దేశించింది. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రత్యామ్నాయ సాగు విధానాలను ప్రోత్సహించనుంది.
ఆయిల్‌పాంకు ప్రాధాన్యం..
నీటి నిర్వహణతోపాటు దీర్ఘకాలిక ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయిల్‌పాం సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రస్తుతం జిల్లాలో 4,662 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్‌పాంను మరో 1,500 ఎకరాలకు విస్తరించాలని కార్యాచరణలో పొందుపరిచారు.
పండ్ల తోటల విస్తరణ..
మామిడి, జామ, సపోట, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, నిమ్మ, అంజూర, మునగ వంటి పండ్ల తోటలను కూడా ప్రోత్సహించనున్నారు. ప్రస్తుతం 12,608 ఎకరాల్లో ఉన్న పండ్ల తోటలను మరో 105 ఎకరాల్లో విస్తరించనున్నారు. పండ్ల తోటల మధ్యలో కంది, పెసర, మినుము, చిరుధాన్యాలు సాగు చేస్తే రైతులకు తక్షణ ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.
కూరగాయలపై ప్రత్యేక ఫోకస్
తక్కువ నీరు, తక్కువ కాలంలో రైతులకు ఆదాయం అందించే కూరగాయల సాగుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లాలో ప్రస్తుతం 2,300 ఎకరాల్లో సాగవుతున్న కూరగాయల విస్తీర్ణాన్ని మరో 4,582 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. టమాట, మిరప, వంకాయ, బెండ, చిక్కుడు, బీర, సోర, కాకర, పాలకూర వంటివి సాగు చేయాలని చెబుతున్నారు.
మల్బరీతో స్థిర ఆదాయం..
వ్యవసాయంలో వైవిధ్యీకరణకు పట్టు పరిశ్రమ మంచి ప్రత్యామ్నాయం అని ఉద్యాన శాఖ పేర్కొంది. మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేపడితే సంవత్సరానికి ఐదు నుంచి ఆరు పంటలు తీసుకుని రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.
సబ్సిడీలను వినియోగించుకోవాలి
పండ్ల తోటలు, బిందు సేద్యం, మల్చింగ్, నీటి కుంటలు, మల్బరీ సాగు, కూరగాయల నారు తదితర వాటికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. రైతులు ఈ అవకాశాలను వినియోగించుకుని ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని ఉద్యాన వన శాఖ అధికారులు పేర్కొన్నారు.
కూరగాయలు
125
పూలు, ఎర్ర మిరప తదితర ఉద్యానవన పంటల సాగును కూడా విస్తరించనున్నారు. ప్రస్తు తం 730 ఎకరాల్లో ఉన్న ఈ పంటలను మరో 125 ఎకరాలకు పెంచాలని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలకు బిందుసేద్యం ద్వారానే నీటిని అందించాలని ఉద్యాన శాఖ సూచించింది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తడులు ఇవ్వడం, మల్చింగ్ చేయడం, సేంద్రియ ఎరువులు వినియోగించడం, ఫర్టిగేషన్ అమలు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది. పొడి వాతావరణంలో తెల్ల ఈగ, పేనుబంక, తామర పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైనప్పుడు శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే వినియోగించాలని సూచించింది.


