అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి కృషి

Aug 31 2026 1:08 AM | Updated on Aug 31 2026 1:08 AM

కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

అలంపూర్‌ క్షేత్రంలో మల్టీ మీడియా

సౌండ్‌, లైట్‌ షో ప్రారంభం

అలంపూర్‌ రూరల్‌: ప్రసాద్‌ స్కీంలో భాగంగా అలంపూర్‌ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్‌లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్‌, లైట్‌ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్‌ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్‌, లైట్‌షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్‌, లైట్‌ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. అలంపూర్‌ ఆలయ విశిష్టతను తెలయజేస్తూ, మల్టీ మీడియా సౌండ్‌, లైట్‌ షో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌ నుంచి గద్వాలకు రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్‌ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ స్కీంలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు ఫుడ్‌ కోర్టు, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమృత్‌ పథకంలో భాగంగా చేపట్టిన జోగుళాంబ, గద్వాల రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, టూరిజం అండ్‌ కల్చరల్‌శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వాణి ప్రసాద్‌, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement