కొంతకాలం ఆగాల్సిందే..
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్‌ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఫలితంగా ఎల్లూరు లిఫ్టులో పాడైన మోటార్లకు మరమ్మతు ఈ సీజన్‌లో కూడా చేపట్టని పరిస్థితులు నెలకొన్నాయి.
పాడైపోయిన మోటార్లు..
కేఎల్‌ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టును ఎల్లూరు సమీపంలోని రేగుమాన్‌గడ్డ వద్ద నిర్మించారు. ఈ లిఫ్టులో 5 మోటార్లు ఉండగా.. నాలుగు మోటార్లతో నీటి పంపింగ్ చేపట్టి, ఒక మోటార్‌ను స్పేర్‌లో ఉంచుకునేలా ఏర్పాట్లు చేశారు. 2012 సెప్టెంబర్‌లో కేఎల్‌ఐ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అదే నెలలో ఎయిర్ ఫ్రెషింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పంపు మోటార్లు పాడవగా.. వెంటనే వాటికి మరమ్మతు చేశారు. 2014 సెప్టెంబర్‌లో 5వ నంబర్ పంపు మోటార్‌లోకి నీళ్లు చేరి పాడైంది. తర్వాతి కాలంలో మరో పంపు మోటార్ కూడా మరమ్మతుకు గురైంది.
మూడున్నరేళ్ల క్రితం నిధులు..
కొన్ని సంవత్సరాల కాలంగా మోటార్ల మరమ్మతు పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. మోటార్ల మరమ్మతు కోసం మూడున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో కేఎల్‌ఐ ద్వారా నీటి లిఫ్టింగ్‌ను ఆపేసి మోటార్లకు మరమ్మతు చేపట్టేందుకు అప్పట్లో బీహెచ్‌ఈఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే మిషన్ భగీరథ స్కీంకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతు ఆపేసి మళ్లీ యథాతధంగా కేఎల్‌ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కేఎల్‌ఐ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాడైన మోటార్లకు మరమ్మతు చేపట్టడం సాధ్యం కావడం లేదు.
పాడైన
మోటార్లు
2
కేఎల్‌ఐ మోటార్ల మరమ్మతుఈ సీజన్ కూడా ఆగాల్సిందే
ఎంజీకేఎల్‌ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు
మూడేళ్ల క్రితమే రూ.16 కోట్ల నిధులు కేటాయింపు
వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు
ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మూడుపంపులతోనే ఎత్తిపోతలు
పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోతలు కొనసాగితే కేఎల్‌ఐ ప్రాజెక్టుకు కొంత విరామం ఇవ్వాలనుకున్నాం. అయితే పలు కారణాలతో అది సాధ్యపడటం లేదు. తాగునీటి అవసరాల కోసం రెగ్యులర్‌గా కేఎల్‌ఐ ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నాం. పాడైన మోటార్ల మరమ్మతుకు ఇంకా కొంతకాలం ఆగక తప్పదు.
– లోకిలాల్‌నాయక్,
నీటిపారుదల శాఖ ఈఈ


