వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్ ప్రధాన నిందితుడిగా నమోదైన పోక్సో కేసు నీరుగారేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చీకటి స్నేహమే ప్రధాన కారనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేసినా గంటల తర్వాత నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. ఆ తర్వాతే పోక్సో కేసు నమోదు చేయటం, ప్రధాన నిందితుడిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలంటూ నిందితుడి తండ్రికి బదులు మేనమామకు నోటీసీలు జారీ చేయటం లాంటి చర్యలను ఉదాహరణగా చెప్పవచ్చని వివరించారు. బాధితురాలి తల్లి తన కూతురిని హింసించిన విధానాన్ని స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొన్న తర్వాత కూడా.. అరెస్టు చేయటానికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఉంటుందని ఏ చట్టంలో ఉందో చెప్పాలని సైబరాబాద్, కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. బాహాటంగా కేంద్రమంత్రి బాధితులను కార్నర్ మీటింగ్‌లో భయబ్రాంతులకు గురి చేసేలా ప్రసంగాలు చేస్తుంటే.. పోలీస్‌శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మైనర్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరస్ చేస్తూ.. వారిని మానసింగా హింసకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు సీఎం స్వయంగా పోలీసులు ఉన్నతాధికారులకు సంకేతాలిచ్చారని, అందువల్లే.. పోలీసులు ఐదురోజులుగా అరెస్టు చేయటం లేదన్నారు. నిందితుడు రహస్యంగా దేశం దాటి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు బాదితులను శాంతిపంజేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..అధికారం ఉందని చట్టవ్యతిరేక పనులు చేయవచ్చా అని ప్రశ్నించారు. అధికారులు న్యాయవ్యవస్థ, చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ బి.లక్ష్మయ్య, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, కర్రెస్వామి, హరిబాబు, నీలస్వామి, హేమంత్, చిట్యాల రాము, జోహెబ్, భాస్కర్, కౌన్సిలర్లు సౌజన్య, ఎ.అరుణ, శిరీష, నందిమల్ల శారద, జ్యోతి, నాగమ్మ, కవిత, పవిత్ర, భాను, సరస్వతి ఉన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్


