వైద్యాధికారులు పనితీరు మార్చుకోండి | - | Sakshi
Sakshi News home page

వైద్యాధికారులు పనితీరు మార్చుకోండి

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

పాలమూరు: ‘అన్ని విభాగాల హెచ్‌ఓడీలతోపాటు కొందరు వైద్యులు, టెక్నీషియన్స్‌ హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించడంతోపాటు సమయపాలన పాటించడం లేదని, పీజీ విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులతో వసతుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న అంశంపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రి వైద్యాధికారులపై సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల నుంచి రూ.90 వేలు డొనేషన్‌ తీసుకుని వీల్‌చైర్స్‌, స్టేచర్స్‌ తీసుకురావడం ఏమిటని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఒక సూపరింటెండెంట్‌, అన్ని విభాగాల హెచ్‌ఓడీల మధ్యనే సమన్వయం ఉండటం లేదని మండిపడ్డారు. ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోతే ఒక ఎమ్మెల్యేగా నా దృష్టికి లేదా కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలి కానీ విద్యార్థుల నుంచి డొనేషన్స్‌ ఎందుకు వసూలు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో పనితీరు మార్చుకోవాలని, ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.

అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం..

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో బుధవారం కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అధ్యతన జరిగిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (హెచ్‌డీఎస్‌) సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న చర్యా నివేదిక, ఆస్పత్రిలో రోగులకు కావలసిన సౌకర్యాలు, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. హెచ్‌వోడీలతో పాటు కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్‌ ఆస్పత్రిలో నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న వనరులు, సదుపాయాలు, నిధులను సమర్థంగా వినియోగించుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. అనంతరం బాలింతలకు యెన్నం హెల్త్‌ కిట్లను కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ సురే ందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగ అజ్మీరా, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ శశికాంత్‌, కార్పొరేటర్లు సల్మాన్‌ షరీఫ్‌, సోమిరెడ్డి రమేష్‌రెడ్డి, డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ జె.రాంమోహన్‌, డాక్టర్‌ సామ్యుల్‌, బెజుగం రాఘవేందర్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న

హెచ్‌ఓడీలపై ఆరా

విద్యార్థులతో డొనేషన్లు సేకరించడంపై సీరియస్‌

ఎవరికీ సమన్వయం

లేదని ఎమ్మెల్యే యెన్నం మండిపాటు

Advertisement
 
Advertisement
Advertisement