అడవి బిడ్డలకు అండగా ఆర్డీటీ
● చెంచుల అభ్యున్నతే ముఖ్యం
● ఉచితంగా ఇళ్ల నిర్మాణాలు
● విద్య, వైద్యం, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ
ఉప్పునుంతల: తాత ముత్తాతల కాలం నుంచి పాలకుల పట్టింపు లేక, ప్రభుత్వ సాయానికి నోచుకోక కటిక దారిద్య్రంలో మగ్గిన చెంచులకు ఆర్డీటీ సంస్థ అండగా నిలిచింది. వారి సహకారంతో మండలంలోని మారుమూల సీబీతండాలో చెంచుల జీవన విధానంలో ఊహించని మార్పు వచ్చింది. సంస్థ నుంచి ఏడేళ్ల క్రితం చెంచులకు అధునాతన ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు వైద్యం, చిన్నారులకు విద్య తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో చెంచుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. గతంలో ఇళ్లు లేకపోవడం, పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే చెంచులు ప్రస్తుతం గ్రామంలోనే ఉపాధి పనులకు వెళ్తున్నారు. మరి కొంతమంది గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా బతుకుతున్నారు.
వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఆర్డీటీ సంస్థ నుంచి వెంకటమ్మ అనే చెంచు మహిళకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌గా శిక్షణ ఇచ్చి.. చెంచులకు జ్వరం వచ్చినా, అనారోగ్యానికి గురైనా ప్రాథమికంగా వాడల్సిన కొన్ని మాత్రలను ఆమె వద్ద ఉంచి వైద్యంపై తగు శ్రద్ధ తీసుకుంటున్నారు. తండాలో వారానికి ఒకసారి మొబైల్ క్లినిక్‌ను నిర్వహించి అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. స్థానికంగా వ్యాధి నయం కాని రోగులను సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మన్ననూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు అంబులెన్స్‌లో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలతో పాటు చిన్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటు రాగులు, గుడ్లు, బొబ్బర్లు, పెసళ్లు, బెల్లం అందజేస్తూ చెంచులు శారీరక పుష్టితో పాటు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సహకరిస్తున్నారు.
ఆర్థికాభివృద్ధికి దోహదం
చెంచులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నల్లబోతుల వెంకటమ్మ, దాసరి లింగమ్మ, దాసరి బుచ్చమ్మ అనే ముగ్గురు చెంచు మహిళలకు మేకల పెంపకం కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. చెంచు పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. సైదమ్మ, ఇదయ్య అనే చెంచు విద్యార్థులను ఇంటర్ నుంచి సంస్థ వారే ఫీజులు చెల్లించి కర్నూల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాల్లో చదివించారు. గ్రామంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న చెంచు విద్యార్థులకు స్కూల్ మెటీరియల్, న్యూట్రిషన్ ఫుడ్‌ను అందిస్తున్నారు.


