వేసవిలో ఆకుకూరలు అనుకూలం
అలంపూర్: వేసవిలో ఆకుకూరల సాగు లాభసాటిగా ఉంటుంది. అధిక దిగుబడితో పాటు పెద్దమొత్తంలో లాభాలు పొందవచ్చని అలంపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌రెడ్డి రైతులకు సూచించారు. ఈ క్రమంలో సాగుకు అనువైన రకాలు, జాగ్రత్తలు వివరించారు.
అనుకూల ఆకుకూరలు:
వేసవిలో ముఖ్యంగా గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీన మొదలైన ఆకుకూరలు లాభసాటిగా ఉంటాయి.
తోటకూర:
తోటకూరలో ఆర్‌ఎన్‌ఏ–1 రకం ముఖ్యమైనది. ఆకులు, కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. విటమిన్–ఏ, సీలు అధికంగా ఉంటాయి. కాండం కూడా పీచు లేకుండా మృదువుగా రుచికరంగా ఉంటాయి. నెలరోజుల్లో ఎకరాకు 5– 6 టన్నుల దిగుబడి వస్తుంది. మొదటి కోత ఎత్తిన 15– 20 రోజుల్లో వస్తోంది. మొదటి కోత తర్వాత పక్కకొమ్మలు బాగా వస్తాయి. నీటిఎద్దడిని తెల్ల మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎకరానికి 800 గ్రాముల విత్తనం అవసరం.
పాలకూర :
పాలకూరలో ఆల్‌గ్రీన్ రకం లేత ఆకులు కలిగి 15– 20 రోజులకు కోతకు వస్తుంది. 6– 7 కోతల్లో ఎకరానికి 5– 6 టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరానికి 10– 12 కిలోల విత్తనాలు అవసరం. విత్తనాలను 2– 10 సెంటీమీటర్ల ఎడంగా, 3– 4 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి. లోతు ఎక్కువైతే మొక్క సరిగ్గా రాదు. విత్తిన 8– 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి.
గోంగూర
ఎఎన్‌జీఆర్‌యూ– 1 రకం ప్రధానమైనది. ఎకరానికి 4– 5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరాకు 6 కిలోల విత్తనం అవసరం. ముందుగా 60 సెంటీమీటర్ల ఎడంగా బోదలు చేసుకొని బోదలకు రెండు వైపుల విత్తనాన్ని 30 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో వేయాలి. మొలకెత్తిన 20 రోజులకు వత్తుగా ఉన్న మొక్కలను పీకి కట్టలు కట్టి విక్రయించాలి.
మెంతికూర
పూసా ఎర్లీ బంచీంగ్ రకం. ఇది త్వరగా కోతకు వస్తుంది. ఎకరాకు 8– 10 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి.
కొత్తిమీర
సీఎస్– 6 రకం పంట కాలం 80– 85 రోజులు నీటిఎద్దడిని తట్టుకుంటుంది. సాధన(సీఎస్–4) రకం పేనుబంకను తట్టుకుంటుంది. ఎకరానికి 4– 5 కిలోల విత్తనాన్ని 15 సెంటీమీటర్ల ఎడంలో విత్తుకోవాలి. విత్తిన 8– 12 రోజుల్లో గింజలు మొలకెత్తుతాయి.
ఆకుకూరల సాగు
ఆకుకూరలు
పాడి–పంట
ఎండ నుంచి రక్షణ
ఆకుకూరలు అధిక ఎండలను తట్టుకోలేవు. కాబట్టి వేసవిలో సాగుకు నీడ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. పొలంలో నీడనిచ్చేలా మొక్కజొన్న, ఆముదం పంటలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాటుకోవాలి. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. వేసవిలో నీటి అవసరం ఎక్కువ కాబట్టి స్ప్రింక్లర్ల పద్ధతిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు.
వేసవిలో ఆకుకూరలు అనుకూలం
వేసవిలో ఆకుకూరలు అనుకూలం


