నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
దేవరకద్ర: నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఎన్నికల నిబంధనల ప్రకారం జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. గురువారం దేవరకద్ర మున్సిపాలిటీలో జరుగుతున్న రెండోరోజు నామినేషన్ల ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, భద్రతా చర్యలు, నామినేషన్ స్వీకరణ విధానాన్ని నేరుగా పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడంలో అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ద్వారా సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు. చెక్ లిస్టు ప్రకారం నామినేషన్‌లు దాఖలు చేసేలా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశఽం ఉందని, వచ్చిన అభ్యర్థులను క్యూలైన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని, అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. కచ్చితంగా నామినేషన్ల వివరాలు రిజిస్టర్‌లో సమయంతో సహా నమోదు చేయాలన్నారు. భద్రతాపరంగా పోలీసుశాఖతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహించాలన్నారు. వారి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.


