కార్పొరేషన్‌ను గెలిపించి.. సీఎంకు కానుకగా ఇద్దాం
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, కార్పొరేషన్‌ను గెలుపొంది సీఎం రేవంత్‌రెడ్డికి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు మహబూబ్‌నగర్ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు అని అన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డితో సాధ్యమైందన్నారు. భవిష్యత్ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ.603 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించేందుకు, విజన్ 2047 లక్ష్యంగా రూ.220 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం సీఎం స్వయంగా వచ్చి శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు సర్వేలు, నేను వ్యక్తిగతంగా రెండో సర్వేలు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో విశ్వసనీయత, పార్టీపై నిబద్ధత, గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామని అన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వారినే పరిగణలోకి తీసుకుంటామన్నారు. పార్టీ లైన్ అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎంపికపై తాను సూచన మాత్రమే చేయగలనని, తుది నిర్ణయం సీఎం, టీపీసీసీ, ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రులు తీసుకుంటారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. కార్పొరేషన్‌లో 60 డివిజన్లలో 50కిపైగా గెలుపొందడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఎన్‌పీ వెంకటేశ్, చంద్రకుమార్‌గౌడ్, అమరేందర్‌రాజు, బెక్కరి అనిత, రాజేందర్‌రెడ్డి, సాయిబాబా పాల్గొన్నారు.


