వైభవంగా హంసవాహన సేవ
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పూజలు చేసి తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణలతో స్వామివారి సేవ ముందుకు సాగింది. శుక్రవారం రాత్రి స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


