నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో బుధవారం నుంచి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులతో ఆమె వీసీలో మాట్లాడుతూ ఇప్పటికే శిక్షణ పొందిన ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు వారికి కేటాయించిన మున్సిపాలిటీలలో విధులకు హాజరు కావాల ని ఆదేశించారు. ఉదయం 9 గంటలకు రిటర్నింగ్ అధికారులు వార్డుల రిజర్వేషన్ వివరాలతో ఎన్నికల నోటీసును జారీ చేయాలన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించాలని సూచించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థులఎంపికకు కమిటీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారి నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ల కేటాయింపు కోసం పార్టీ పది మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.ఇందులో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిములు, పట్టణ అధ్యక్షుడు శివరాజుతో పాటు మరో ఆరుగురు నాయకులున్నారు. వీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఇస్తారు. దీని ప్రకారం గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 60 డివిజన్లకు 440 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా దివిటిపల్లికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉత్సాహంగా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి సంగారెడ్డిలో హెచ్‌సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కోచ్‌లు గోపాలకృష్ణ, ముఖ్తార్‌అలీ, క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు.


