మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తప్పిదాలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాట్లుపై సూచించారు. జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ ఫారంలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లు, రిసెప్షన్ సెంటర్‌లు, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాల్ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, రూట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మాస్టర్ శిక్షకులు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు వీసీ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


