ట్రిపుల్‌ఐటీలో సీటే లక్ష్యంగా శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఐఐటీలో సీట్లు సాధించే లక్ష్యంగా పదో తరగతి విద్యార్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని బోయపల్లి వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 150 మంది విద్యార్థులకు 45 రోజుల శిక్షణ ఇచ్చి వారికి ట్రిపుల్‌ఐటీలో సీట్లు సాఽధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి జిల్లాకు ట్రిపుల్‌ఐటీ కళాశాలను తీసుకొచ్చామని, దానికి శాశ్వత భవనం నిర్మాణ చేసేందుకు శంకుస్థాపన కూడా చేశామన్నారు. నూతన ట్రిపుల్‌ఐటీ కళాశాలలో జిల్లాకు సంబంధించి ఎనిమిది మంది మాత్రమే చేరారని, ప్రస్తుతం శిక్షణ తీసుకునే వారు 45 రోజులు కష్టపడి చదివితే మంచి ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మాజీ డీఈఓ విజయ్‌కుమార్, జగపతిరావు, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


