ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
● జిల్లాకేంద్రంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
స్టేషన్ మహబూబ్‌నగర్: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని పలువురు బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు టీటీడీ కల్యాణమండపం ఎదుట మంగళవారం సమ్మె నిర్వహించారు. ఆయా బ్యాంకులకు చెందిన వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు వెన్నముక అని అన్నారు. గతంలో ఐదు రోజుల బ్యాంకింగ్ పని విధానం అమలు చేస్తామని అంగీకారం తెలిపినప్పటికీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి మల్లికార్జున్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఆయా బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వర్లు, నరేష్, తిరుమల్‌రెడ్డి, జెట్టి రాజేష్, జగన్నాథరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, ఎంఆర్.జయకర్, నరేష్, శ్రీనివాసులు, రవికుమార్, జ్యోతి, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, ప్రజాసంఘాల ప్రతినిధులు కురుమూర్తి, రాంమోహన్ తదితరులు మద్దతు తెలిపారు.


