సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన వైద్యసేవలు అందిస్తాం
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి జనరల్ ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో నాణ్యతతో కూడిన వైద్యసేవలు అందిస్తామని, కొన్ని రకాల ల్యాప్ సర్జరీలు చేయడానికి సరిపడా పరికరాలు లేవని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం గతేడాది కాలంలో ఆస్పత్రిలో జరిగిన వైద్యసేవలపై వార్షిక నివేదిక విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పాత భవనంలో 650 పడకలు ఉన్న కూడా ఆ స్థాయిలో సర్దు బాటు చేయగలుగుతున్నామని, నూతన భవనం ప్రారంభం చేసుకుంటే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబా టులోకి వస్తాయని తెలిపారు. 2016లో మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత వైద్య విధాన పరిషత్ నుంచి జనరల్ ఆస్పత్రిగా మార్పు చేసి 450 పడకలకు పెంచడం జరిగిందని, 2024లో 650 పడకలకు పెరిగిందన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 775 పడకలు ఉన్న ప్రస్తుతం 650 పడకల సామర్థ్యం ఉందన్నారు. ప్రతి రోజు 1,400 నుంచి 1,500 ఓపీ, 150 వరకు ఐపీ ఉంటుందని, నిత్యం 25 నుంచి 30 కాన్పులు అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 50 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని, పిల్లలకు ప్రత్యేక ఐసీయూ ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో కొత్తగా కీళ్ల మార్పి డి సర్జరీలు, తుంటి మార్పిడి సర్జరీలు, గాల్‌బ్లాడర్, ల్యాప్ సర్జరీలు ఇలా అత్యాధునిక శస్త్ర చికిత్సలు జీజీహెచ్‌లో చేస్తున్నట్లు వెల్లడించారు.
5,02,412 రోగులకు ఓపీ సేవలు..
గతేడాది కాలంలో 5,02,412 రోగులకు ఓపీ సేవలు, 41,607ఐపీ, ఐసీయూ సేవలు అందించినట్లు తెలిపారు. ఏడాదిలో 7,906 మందికి ప్రసవం చేశామని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 1,385 చేసినట్లు తెలిపారు. అన్ని రకాల సర్జరీలు 43,040, ల్యాబ్‌లలో పరీక్షలు 6,22,399, టీప్పాస్కాన్ 155, అల్ట్రాసౌండ్ 3,036, ఈసీజీ 31,937, సీటీ స్కాన్ 10,320 చేసినట్లు వివరించారు. ఇక హెచ్‌ఐవీ పరీక్షలు 19,796, క్షయ పరీక్షలు 3,872, డయాలసిస్ 7, 270, 456 క్యాన్సర్ రోగులకు చికిత్సలు, 240 మందికి కీమోథెరపీ, గృహసందర్శనలో 2,125 మందికి చికిత్సలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాముకాటు 911, కుక్కకాటు 11,522తో పాటు డెంటల్ విభాగంలో 3,206 మందికి చికిత్స చేసినట్లు చెప్పారు. అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ మాధవి, డాక్టర్ సునీల్, నాగరాజు, వంశీ, ప్రేరణ, ఆర్‌ఎంఓలు శిరీష, జరీనాభాను, దుర్గా, సమత, గణేష్, సీహెచ్‌ఓ రాములునాయక్, బ్లడ్‌బ్యాంక్ మధుసూదన్‌రెడ్డి, పాల్గొన్నారు.


