సీఎం సభకు పకడ్బందీగా ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి రానున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ విజయేందిర బోయితో పాటు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగసభ, చిట్టిబోయినపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు రూ.1,200 కోట్ల విలువ జేసే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి వేల కోట్ల నిధులు మంజూరు చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతులు, రవాణా, సాగు, తాగునీరు, యూజీడీ, రహదారులు, భవనాల రంగాల్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి సమీపంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ కళాశాల భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చిట్టబోయినపల్లి వద్ద ఎన్‌హెచ్ పక్కనే త్రిపుల్ ఐటీ కళాశాల నిర్మించనున్నామన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యూజీడీకి రూ.603 కోట్లు, నగర ప్రజల శాశ్వత తాగునీటి సరఫరా పరిష్కారానికి రూ.220 కోట్లు, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల అదనపు భవనానికి రూ.20 కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.200 కోట్లు తదితర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. ఆయా కార్యక్రమాలలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్‌నాయక్, ఆర్‌డీఓ నవీన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రీ, శాంతన్నయాదవ్, గోనెల శ్రీనివాసులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల వారీగా
ఓటరు జాబితా విడుదల
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. మొత్తం 60 డివిజన్లకు గాను 277 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, వీటిలో ఐదు చోట్ల మార్పులు, చేర్పులు చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 1,97,841 మంది ఓటర్లకు సంబంధించిన ఫొటోలను పొందుపరిచారు. వీరిలో పురుషులు 97,636 మంది, మహిళలు 1,00,191 మంది, ట్రాన్స్‌జెండర్లు 14 మంది ఉన్నారు. ఈ వివరాలతో కూడిన ప్రతులను కలెక్టరేట్‌తో పాటు ఆర్‌డీఓ, అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నోటీసు బోర్డులలో ఉంచారు.
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు
పాలమూరు: నగరంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న స్టేట్‌హోం, చిల్డ్రన్ హోంలను శుక్రవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సందర్శించారు. స్థానికంగా నివసిస్తున్న చిన్నారులకు సంబంధించిన వసతి, అందిస్తున్న ఆహారం, విద్య, వైద్యం ఇతర సదుపాయాలను పరిశీలించారు. ప్రధానంగా భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం వంటి చట్టాలపై అవగాహన కలిగించారు. చిన్న వయస్సులో పెళ్లిలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. పోక్సో చట్టం ద్వారా పిల్లలకు లభించే చట్టపరమైన రక్షణలను వివరించారు. పిల్లల హక్కులను కాపాడటంతో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.


