ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకం
మహబూబ్‌నగర్ క్రైం: సమాజంలో ఫార్మసీ రంగం మనుషుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని సరోజిని రాములమ్మ ఫార్మసీ కళాశాలలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడుతూ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు భవిష్యత్ ఆరోగ్య రక్షకులుగా ఉంటారని తెలిపారు. డ్రగ్ దుర్వినియోగం యువతను, సమాజాన్ని నాశనం చేస్తోందన్నారు. ఫార్మాసిస్ట్‌లు డ్రగ్స్ సురక్షిత వినియోగానికి వాడాలి తప్ప దుర్వినియోగం చేయరాదన్నారు. క్రమశిక్షణ పాటిస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఎస్పీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బాలరాజు, ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం పాల్గొన్నారు.


