‘పీఎం జన్‌మన్’ కింద చెంచులకు సంక్షేమ పథకాలు
● కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘పీఎం జన్ మన్’ కింద చెంచు కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మహమ్మదాబాద్, గండేడ్, హన్వాడ, నవాబుపేట, మహబూబ్‌నగర్ రూరల్ మండలాలలోని 16 గ్రామాల్లో 481 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాలన్నారు. ముఖ్యంగా ఆధార్‌కార్డు లేనివారికి ఆధార్‌తో పాటు ఆయుష్మాన్ భారత్, రేషన్, పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు, జన్‌ధన్ ఖాతాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, పీఎం కిసాన్ నిధి, పీఎం సమ్మాన్ నిధి అందించాలన్నారు. ప్రతిఒక్కరూ ఆధార్‌కార్డు కచ్చితంగా తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వారికి జనన ధ్రువీకరణపత్రాలు త్వరగా మంజూరు చేయాలని, జాబ్‌కార్డు, ఆత్మీయ భరోసా, వృద్ధ్యాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు ఇవ్వాలన్నారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ భవనాలు, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, రోడ్డు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్దన్, డీఆర్‌డీఓ నర్సింహులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం, డీఏఓ వెంకటేష్, ఎల్‌డీఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రైతులు పత్తిని బాగా అరబెట్టుకొని తేవాలని, తేమశాతం 8 నుంచి12 వుంటే మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కాటన్ మిల్లు యజమానులు, సీసీఐ అధికారులు, మార్కెటింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పత్తి లూజ్‌గా ఎక్కువ మొత్తంలో తీసుకొని రావద్దని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 కాటన్ సీజన్ సంబంధించి ఎల్1, ఎల్ 2, ఎల్ 3 కింద విభజించబడిన కాటన్ మిల్లులు రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మిల్లులు వెంటనే ప్రారంభించాల్సిందిగా సీసీఐ అధికారులకు సూచించారు. ఈ నెల 6న రాష్ట్ర జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ కొనుగోళ్లు మూసివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మిల్లు యజమానులతో కలెక్టర్ ఈ సమావేశము ఏర్పాటు చేశారు. మిల్లులు మూయవద్దని, రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్నారని, వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, ఆర్‌డీఓ నవీన్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటే ష్, మార్కెటింగ్ ఏడీబాలమణి పాల్గొన్నారు.


