శిశువుల ఆరోగ్యంపైదృష్టి సారించండి
పాలమూరు: ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని శిశుగృహా, చిల్డ్రన్ హోంను మంగళవారం న్యాయమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా రెండుచోట్ల వసతులు, సౌకర్యాలు పరిశీలించారు. చిన్నారులకు అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయా? లేదా అనే విషయంపై సిబ్బంది దగ్గర ఆరా తీశారు. అనంతరం సీడీపీఓలు, సీఎంపీఓలకు బాల్యవివాహాలు, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. దీంతో పాటు పలు రకాల న్యాయచట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో డబ్ల్యూఓ జరీనా పాల్గొన్నారు.
11 మెడికల్ షాపుల యజమానులకు నోటీసులు
పాలమూరు: ఉమ్మడి జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల బృందం మంగళవారం కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో మెడికల్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ అంజుమన్ అబీద ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో కల్వకుర్తి, ఊర్కొండ, చారకొండ, వంగూరు, వెల్దండ మండల కేంద్రాల్లోని 11 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ నిబంధనలు, ఔషధాల నిల్వ, విక్రయాల విషయంలో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ హెచ్చరించారు. తనిఖీల్లో నాగర్‌కర్నూల్ డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ విశ్వంత్‌రెడ్డి, ఇతర జిల్లాల డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, అన్వేష్, శ్వేత బిందు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల కరాటే జట్ల కోసం ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఎంపికలను ప్రారంభించారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 300 మంది హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, పరుశరాముడు, శశికళ, ఉమ్మడి జిల్లాలోని కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.
నైపుణ్యాలను
వెలికితీసేందుకు స్పార్క్‌ఫెస్ట్
స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీ గురుకులాలు, కళాశాలస్థాయిలో విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పార్క్‌ఫెస్ట్ నిర్వహించినట్లు గురుకులాల ఆర్‌ఎల్‌సీ ఖాజా బాహుద్దీన్ తెలిపారు. జిల్లాకేంద్రం భగీరథకాలనీలోని మైనార్టీ బాలికల గురుకులాల క్యాంపస్‌లో మంగళవారం స్పార్క్‌ఫెస్ట్ నిర్వహించారు. వ్యాసరచన, ఉపన్యాసం, పాటలు, చర్చ, చిత్రలేఖనం, స్పెల్ బీ, ప్రశ్నావళి అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ గురుకుల విద్యార్థులను తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం ప్రథమస్థానంలో నిలిచిన వారికి మెమోంటోలు అందజేశారు. అధికారులు జమీర్‌ఖాన్, మసూద్, సలీం, జహీర్, తదితరులు పాల్గొన్నారు.
శిశువుల ఆరోగ్యంపైదృష్టి సారించండి
శిశువుల ఆరోగ్యంపైదృష్టి సారించండి
శిశువుల ఆరోగ్యంపైదృష్టి సారించండి


