రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం
మెట్టుగడ్డ: రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని బీసీ జేఏసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్ బెక్కెం జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన బీసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యమానికి అన్నిపార్టీల మద్ద తు అవసరముందని, 42 శాతం రిజర్వేషన్లు సాధించాలంటే ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తమ బీసీ జేఏసీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, ఏ పార్టీకి అనుకూలం కాదన్నారు. బీసీ జేఏసీ తీసుకెళ్లే ప్రతి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ప్రజలంతా రిజర్వేషన్లు సాధించే వరకు ప్రతి ఒక్కరూ ముందుకుకదలాలని, గ్రామగ్రామాన యువత కదం తొక్కాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా బీసీ ఉద్యమం నిర్మిద్దామన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధనకు రెండునెలల ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 6న ఫూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన ప్రదర్శన, 13న ధర్మ పోరాట దీక్ష, 16న రన్‌ఫర్ సోషల్ జస్టిస్, 23న అఖిలపక్ష పార్టీల సమావేశాలు, డిసెంబర్ మొదటివారంలో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి, మూడోవారంలో బీసీల బస్సుయాత్ర, జనవరిలో వేల వృత్తుల.. కోట్ల గొంతుకలతో బహిరంగసభ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకులు సంజీవ్ ముదిరాజ్, శ్రీనివాస్, వెంకటయ్య, బ్రహ్మయ్య, లక్ష్మణ్‌గౌడ్, చంద్రకుమార్ గౌడ్, శ్రీనివాస్‌సాగర్, రాజు, ప్రభాకర్, యాద య్య, రాందాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.


