క్రాసింగ్ రైల్వేస్టేషన్‌గా ఊట్కూర్
నారాయణపేట: మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయి ఊట్కూర్ వద్ద రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయడంపై చర్చించారు. మక్తల్–నారాయణపేట–వికారాబాద్ జిల్లాలతో పాటు అనేక గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే రూ.438 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 122 కి.మీ రైల్వేలైన్ కృష్ణా–మక్తల్–నారాయణపేట–దామరగిద్ద–బలంపేట–దౌల్తాబాద్–కొడంగల్–పరిగి–వికారాబాద్ అలైన్‌మెంట్‌లో భాగంగా ఊట్కూర్ స్టేషన్‌గా గుర్తించబడిందని, దీనిని క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం వల్ల స్థానికంగా 30 గ్రామాల ప్రజలు దాదాపుగా 60 వేలకు పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం కోట్ల ఉదయ్‌నాథ్, రైల్వే సెక్రటరీ శ్రీనివాస్, ఉట్కూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యజ్ఞేశ్వర్‌రెడ్డి, శివ తదితరులు ఉన్నారు.


