
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం 75 వేల క్యూసెక్కులు ఉండగా.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో 1.08 లక్షలకు చేరిందన్నారు. దీంతో 12 క్రస్ట్‌గేట్లు ఎత్తి 58,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 32,719 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 500, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 200, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.933 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిర్విరామంగా కొనసాగుతుందని ఎస్ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 165.284 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 196.082 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 361.366 మి.యూ. ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
సుంకేసులకు 50 వేల క్యూసెక్కులు..
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం పెరిగింది. 50 వేల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. 14 గేట్లను తెరిచి 52,682 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్‌కు 1,847 క్యూసెక్కులు మొత్తం 54,529 క్యూసెక్కులు వినియోగించినట్లు జేఈ మహేంద్ర వివరించారు.
1.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
12 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు విడుదల