
రైల్వే డబ్లింగ్ లైన్ భూ సేకరణపై ఆరా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం భూ సేకరణపై అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అధికారులతో చర్చించారు. బుధవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని రైల్వే లైన్ ఉన్న గ్రామాలు అల్లీపూర్, ధర్మాపూర్, రాంచంద్రాపూర్, మాచన్‌పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం మండలంలో రైతుల నుంచి ఎంత భూమి పోతుందని అడగగా.. ఒక్కో రైతు పొలంలో 2 గుంటల నుంచి 9 గుంటల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి భూ సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని.. రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ నవీన్, సర్వే ల్యాండ్ ఏడీ కిషన్‌రావు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రుణమాఫీ కోసం ప్రతిపాదనలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని చేనేత కార్మికులు తీసుకున్న రుణాల మాఫీ కోసం జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాస్థాయి చేనేత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యలో తీసుకున్న రుణాలను మాఫీకి ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. 54 మంది చేనేత కార్మికులకు సంబంధించిన రుణాలు రూ.27,12,971లను మాఫీ చేసేందుకు కమిటీ ద్వారా ప్రభుత్వానికవ ప్రతిపాదనల పంపినట్లు తెలిపారు. సమావేశంలో చేనేత శాఖ ఆర్‌డీఈ పద్మ, ఏడీ బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, నాబార్డ్ డీడీఎం షణ్ముఖచారి, కో ఆపరేటివ్ సహకార అధికారి టైటస్‌పాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.