
నిందితుల్లో బాలిక సొంత అన్నసహా మరో నలుగురు
మూడు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి..
మహబూబ్ నగర్ జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జడ్చర్లలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జడ్చర్లలోని 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకునిఉన్న ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం (ఆదివారం) పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు.
నిందితుల్లో ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో నలుగురు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తరువాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్లు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆరోజు నుంచి బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో బుధవారం సాయంత్రం చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్ పరిశీలించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న, స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.