
హోంగార్డుల విధులపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్‌శాఖలో పనిచేసే క్రమంలో హోంగార్డులు క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ డి.జానకి అన్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి రొటేషన్ పద్ధతిలో జిల్లాకు కేటాయించిన 110 మంది హోంగార్డులతో సోమవారం పరేడ్ మైదానంలో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న హోంగార్డుల సంక్షేమం కోసం పోలీస్‌శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. రోజు వారి విధుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. హోంగార్డులను ఎంటీ సెక్షన్, జనరల్ డ్యూటీ, బ్లూకోల్ట్స్, ట్రాఫిక్, తప్పాల్ వంటి విభాగాల్లో నియమించనున్నట్లు తెలిపారు. వారికి కేటాయించిన విభాగాల్లో నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.