కరివేపాకు సాగు.. లాభాలు బాగు
అలంపూర్: కరివేపాగు సాగు ఎంతో సులభమని.. జిల్లా వాతావరణం అనుకూలంగా ఉంటుందని డీఏఓ సక్రియనాయక్ తెలిపారు. ఎర్ర నేలలో పంట సాగుచేస్తే అధిక దిగుబడి వస్తోందని.. లాభాలు అర్జించవచ్చని సూచిస్తున్నారు.
పంట రకాలు..
సెంకంపు: ఈ రకం తమిళనాడులో అధికంగా పండిస్తారు. ఆకు ఎక్కువగా ఉండి నూనే శాతం, వాసన కలిగి ఉంటాయి.
డీడబ్ల్యూడీ–1: ఈ రకం ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చలిని తట్టుకోలేదు.. ఆకులను పొడిగా చేసుకొని వాడుకోవచ్చు.
డీడబ్ల్యూడీ–2: విత్తనాల ద్వారా వేసిన పంట నుంచి ఎన్నుకోబడిన రకం. ఆకు లేతపసుపు రంగులో ఉండి వాసన తక్కువగా ఉంటుంది. చలిని తట్టుకుంటుంది. పెరుగుదల అధికంగా ఉంటుంది.
సువాసిని: వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మెట్ట ప్రాంతాలకు అనుకూలం.
భువనేశ్వర: నీటివసతి ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతుంది. అన్ని రకాల నేలల్లో పండిస్తారు. మురుగునీరు పారుదల సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు శ్రేష్టం. ఎర్ర తువ్వ నేలల్లో పెరుగుదల బాగా ఉంటుంది. ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
విత్తుట: విత్తనాలతో నారు మొక్కలను పెంచి ప్రధాన పొలాల్లో నాటాలి. నారు పెంచేందుకు బాగా పెరుగుదల కలిగిన తల్లి చెట్ల నుంచి బాగా పండించిన మంచి పండ్లు కోయాలి. జులై, ఆగస్టు నెలల్లో పండ్లు కాస్తాయి. ఆగస్టులో పండ్లు సేకరించుకొని కోసిన 3, 4 రోజుల్లో విత్తనాలు తీసి నారుమళ్లు, పాలిథిన్ సంచుల్లో విత్తాలి. ప్రతి పండులో 3, 4 విత్తనాలు ఉంటాయి.
విత్తన మోతాదు: ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనాలు లేదా 25 కిలోల పండ్లు సరిపోతాయి.
విత్తే పద్ధతి: మీటర్ విస్తీర్ణంలో 30 సె.మీ. ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేయాలి. నారుమడికి తగినంత పశువుల ఎరువు వేసి తర్వాత 10 సె.మీ. దూరంలో విత్తనాలు విత్తుకోవాలి. మూడురోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.
నేల తయారీ, మొక్కలు నాటుట..
ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. 30.30.30 సె.మీ. పరిమాణం గల గుంతల్లో 1.2 నుంచి 1.5 మీ దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి రెండు నెలల ముందు గుంతలు తీయాలి. ఈ గుంతలను పశువుల ఎరువు కలిపి నింపాలి. గుంత మధ్యలో ఒక్కో నారు మొక్క నాటాలి.
ఎరువులు: ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 28 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఉన్న ఎరువును కలిపి గుంతలో సమానంగా నింపాలి. మొక్కలను నాటిన వెంటనే గుంతలను తడపాలి. మూడోరోజు మరో తడి అందించాలి. గుంతలను కలుపుతూ కాల్వలు ఏర్పాటు చేసి నీటిని అందించాల్సి ఉంటుంది.
అంతర కృషి: గుంతల మధ్య ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. మొదటి సంవత్సరం గుంతల మధ్య అపరాలు పండించవచ్చు.
సస్యరక్షణ చర్యలు: గొంగళి పురుగు చిన్నప్పుడు తెల్లని చారలతో నలుపు రంగులో ఉంటుంది. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులో లావుగా స్థూపాకారంలోకి మారుతుంది. పురుగులను చేతితో తీసి నాశనం చేయడం శ్రేయస్కరం, వేప సంబంధిత క్రిమిసంహార మందులు ఉపయోగించాలి. తప్పని పరిస్థితుల్లో నువాన్ 1 మి.లీ. లేదా 2 మి.లీ. క్వినాల్‌పాస్ లీటర్ నీటితో కలిపి పిచికారి చేయాలి.
● ఆకుపచ్చ తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు గ్రాము కార్బండిజం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గంధం కలిగిన క్రిమి నాశికాలను వాడితే ఆకు రాలిపోతుంది. కాబట్టి మందును వాడరాదు.
దిగుబడి: మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 160 కిలోల దిగుబడి వస్తోంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కో కోతలో ఎకరాకు 700 కిలోల చొప్పున సంవత్సరానికి 2,100 కిలోల ఆకు వస్తుంది. 4వ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒక కోతలో వెయ్యి కిలోల చొప్పున 4 వేల కిలోల దిగుబడి వస్తుంది. 5 సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎకరాకు 2 వేల కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలో ఆకు దిగుబడి వస్తుంది.
పాడి–పంట
కరివేపాకు సాగు.. లాభాలు బాగు


