చారకొండ: మండలంలోని డిండి– నార్లాపూర్ లిప్టు ఇరిగేషన్‌లో భూములు కోల్పోతున్న సిర్సనగండ్ల ఆలయ భూమి, కొన్నేళ్లుగా సాగు చేస్తున్న రైతులు ఎవరికి భూ పరిహారం అందించాలని విషయమై శుక్రవారం మండలంలోని కమాల్‌పూర్‌లో కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా కొలిక్కి రాలేదు. కమాల్‌పూర్ శివారులో సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించి 51.32 ఎకరాల భూమి కాల్వ నిర్మాణంలో కోల్పోతుంది. దీంతో ప్రభుత్వం భూ పరిహారం కింద ఎకరాకు రూ.5.30 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ పరిహారం పంపిణీపై శుక్రవారం గ్రామసభలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గత కొన్నేళ్లుగా భూములు నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకే పరిహారం దక్కాలని కమాల్‌పూర్ రైతులు వేడుకున్నారు. అయితే భూ పట్టాలు తమ పేరిట ఉన్నందున దేవాదాయ శాఖకు పరిహారం చెల్లించాలని దేవాదాయ శాఖ అధికారులు పట్టుబట్టారు. దేవాలయ భూములు ఉన్న అభివృద్ధి చెందలేదని వారు పేర్కొన్నారు. దీంతో ఆర్డీఓ శ్రీను మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో రైతులు ఏ సర్వే నంబర్‌లో ఎంత పొలం సాగు చేస్తున్నారు.. తదితర వివరాలపై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి, దేవాదాయ తహసీల్దార్ గిరిధర్, ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, డీఎల్‌ఐ ఏఈ సుభాషిణి, ఆర్‌ఐ భరత్‌గౌడ్, కార్యదర్శి రవి పాల్గొన్నారు.