జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ సంబంధిత అర్జీలను పరిశీలించి తగిన కారణాన్ని సరిగ్గా వివరిస్తూ వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులకు త్వరితగతిన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. మండలంలో పని జరగడం లేదని జిల్లాస్థాయి ప్రజావాణికి భూ సమస్యలైపె పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కొత్త దరఖాస్తులను తీసుకొని.. వాటిని పరిశీలించి స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నారు. కోర్టు కేసులు, ధరణి వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.
ఓటరు జాబితాకు రాజకీయ పార్టీల
సహకరించాలి
ఓటరు జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర కోరారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదు లో అభ్యంతరాలు, చిరునామా మార్పు, బదిలీలు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం నిరంతరం కల్పించిందన్నారు. ఆయా సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, ఆర్‌డీఓ నవీన్, సర్వే లాండ్ ఏడీ కిషన్‌రావు, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం, ఎన్నికల డీటీ జాఫర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.