● వరంగల్ జిల్లాలో ఘటన
దుగ్గొండి: ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని రేబల్లె గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అడ్డాల హరినాథ్(28) డిగ్రీ పూర్తి చేసిన అనంతరం తన తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయం అనుకూలించ లేదు. కుటుంబ జీవనం ఎలా అని ఆలోచించిన హరినాథ్ రెండు నెలల క్రితం ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్ వెళ్లాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. దీంతో ఐదు రోజులక్రితం తన అక్క కూతురు ఫంక్షన్ కోసం ఇంటికి వచ్చాడు. మళ్లీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాలనుకున్నాడు. కానీ, అక్కడ ఫలితం ఉండదని భావించి ఇంట్లో అందరూ పనులకు వెళ్లాక శనివారం ఉదయం దూలానికి ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాసిరెడ్డి మహేందర్ తెలిపారు.


