మినీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మినీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

● భవిష్యత్‌ జాతరలకు ఉపయోగపడేలా శాశ్వత వసతులు

● రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని, ప్రస్తుత జాతర అవసరాలతోపాటు భవిష్యత్‌ జాతరలకు ఉపయోగపడేలా శాశ్వత మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. 2027 ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లపై శనివారం మేడారంలోని హరిత హోటల్‌లో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత మహాజాతర సందర్భంగా చేపట్టిన పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించి, పూర్తయినవి, పెండింగ్‌లో ఉన్నవి, కొత్తగా చేపట్టాల్సిన వివరాలను సమర్పించాలన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధాన, ఇతర పూజారులతో చ ర్చించి భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు గుర్తించాలన్నారు. కాగా, కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో జరిగే జాతరపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.

ఆర్థిక శాఖ పరిశీలనలో మేడారం మాస్టర్‌ ప్లాన్‌

మేడారం సమగ్రాభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. జాతర సమయంలో తలెత్తే ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రహదారుల విస్తరణ, శాశ్వత బస్టాండ్‌ నిర్మాణం, ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో మేడారంతో పాటు మల్లూరు దేవాలయానికి భక్తుల రాక పెరిగే అవకాశముందని, ఈ నేపథ్యంలో ముందస్తుగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ మినీ మేడారం జాతర ఏర్పాట్లపై ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తామని, ఆయా శాఖలు నోడల్‌ అధికారులను నియమించాలని సూచించారు. అంతకుముందు మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, అదనపు కలెక్టర్లు సీహెచ్‌. మహేందర్‌జీ, సంపత్‌ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, మేడారం ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, స్థానిక సర్పంచ్‌ పీరిళ్ల భారతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement