● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు మరింత నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బందికి వారంరోజుల ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో సోమవారం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ విధులు, దర్యాప్తు విధానాలు, రికార్డుల నిర్వహణ, చట్టాల అమలు, ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డాక్యుమెంటేషన్, కోర్టు సంబంధిత ప్రక్రియలు, ప్రాక్టికల్ అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నామన్నారు. పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగాలంటే ప్రతీ కేసు చట్టబద్ధంగా, పారదర్శకంగా, నాణ్యతతో దర్యాప్తు జరగాలన్నారు. ప్రతీ పోలీసు సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిపాలనలో రైటర్ల పాత్ర అత్యంత కీలకమని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ పత్రాన్ని నిర్దేశిత సమయంలో సిద్ధం చేయాలని, చట్టాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని, పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీసు సిబ్బంది తమ విధులను బాధ్యతగా కాకుండా ప్రజాసేవగా భావించాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతీరోజు విధుల్లో అమలు చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


