మత్తడి @ రెండు చెరువులు | - | Sakshi
Sakshi News home page

మత్తడి @ రెండు చెరువులు

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

మహబూబూబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువుల్లో కొంతమేర నీటిమట్టం పెరిగింది. జిల్లాలో 1,590 చెరువులకు గానూ 221 చెరువులు నిండగా.. అందులో రెండు చెరువులు మాత్రమే మత్తడి పోస్తున్నాయి. అయితే చెరువుల కింద ఆయకట్టు రైతులు వానాకాలం పంటపై ఆశలు పెంచుకుంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండి పంటలు సాగు చేస్తామని భావిస్తన్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం.

జిల్లాలో 1,590 చెరువులు..

జిల్లాలోని 18 మండలాల్లో 1,590 చెరువులు ఉండగా.. అందులో 1,097 చెరువులు 25శాతం నిండాయి. 250 చెరువులు 25 నుంచి 50 శాతం, 20 చెరువులు 50నుంచి 75 శాతం, 221 చెరువులు 75 నుంచి 100 శాతం నిండాయి. ఏజెన్సీ ప్రాంతమైన బయ్యారం మండలంలో రెండు చెరువులు మాత్రమే నిండి మత్తడి పోస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గంగారం మండలంలో 213 చెరువులు నిండాయి.

ఎస్సారెస్పీపైనే ఆధారం..

జిల్లాలో ఎస్సారెస్పీ డీబీఎం 48, డీబీఎం 60 కాల్వ లు, ఉపకాల్వల ద్వారా చెరువులకు నీటి సరఫరా చేస్తారు. ప్రతీ సంవత్సరం రెండుసార్లు ఎస్సారెస్సీ జలాలు విడుదల చేస్తారు. డీబీఎం 48కాల్వ కింద 1,24,336 ఎకరాల ఆయకట్టు ఉండగా.. డీబీఎం 60కాల్వ కింద 80,719 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా, ఎస్సారెస్పీ నిండితేనే నీరు విడుదల చేస్తారు.

1,93,850 ఎకరాల్లో సాగు..

వానాకాలం సాగు అంచనా 4,56,136 ఎకరాలు ఉండగా.. నేటి వరకు 1,93,850 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర, మినుములు, జొన్న, ఇతర పంటలు సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుతాయనే ఆశతో రైతులు ఉన్నారు. ఈసారి వర్షాలు తక్కువేనని, ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పించనప్పటికీ రైతులు మాత్రం వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో 1,590 చెరువులు.. నిండినవి 221 మాత్రమే

మత్తడి పోస్తున్న రెండు తటాకాలు

వర్షాలపైనే అన్నదాతల ఆశలు

చెరువులు నిండితే సాగు పెరిగే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement