న్యూస్‌రీల్
●
సాక్షి ప్రతినిధి, వరంగల్:
పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతకు భారీ అవకాశాలు వచ్చాయి. తాజా నియామకాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించి కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులు కలిపి 1,117 ఖాళీల భర్తీగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో వివిధ కేడర్లకు చెందినవి అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 656 పోస్టులు ఉండగా.. ములుగు 189 పోస్టులతో రెండో స్థానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లికి 126, మహబూబాబాద్‌కు 106 పోస్టులు దక్కాయి. వీటితోపాటు ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో 101 అవకాశాలు ఉన్నాయి.
మనదే అత్యధిక వాటా..
పోలీస్ కొలువుల్లో ఉమ్మడి జిల్లాకు అత్యధిక అవకాశాలున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 721, ఏఆర్ 260 కలిపి మొత్తం 981 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 92 ఫైర్ ఫైటర్ పోస్టులు, జైళ్ల శాఖలో 42 పురుష వార్డర్, 2 మహిళా వార్డర్ పోస్టులున్నాయి. ఈ మూడు విభాగాల్లో 1,117 పోస్టులు ఉండడం నిరుద్యోగ యువతకు ఊరటనిస్తోంది. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 656 పోస్టులున్నాయి. ఇందులో 500 సివిల్ కానిస్టేబుల్, 129 ఏఆర్ కానిస్టేబుల్, 15 ఫైర్ ఫైటర్, 11 పురుష వార్డర్, ఒక మహిళా వార్డర్ పోస్టు ఉ న్నాయి. ములుగులో 189 పోస్టులు ఉండగా.. భూ పాలపల్లిలో 126, మహబూబాబాద్‌లో 106 పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఫైటర్ పోస్టుల్లోనూ ములుగు 25 పోస్టులతో ముందంజలో ఉంది. జనగామలో 16, వరంగల్ కమిషనరేట్, భూపాలపల్లిలో 15 చొప్పున, మహబూబాబాద్‌లో 14, హనుమకొండలో 7 పోస్టులు ఉన్నాయి.
పోలీస్ ఉద్యోగం ప్రజాసేవకు మంచి అవకాశం
పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు. ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం. అర్హత ఉన్న ప్రతీ అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలకు ఇప్పటినుంచే క్రమశిక్షణతో సిద్ధం కావాలి. ఎలాంటి మధ్యవర్తులను నమ్మకుండా ప్రతిభతో ఉద్యోగం సాధించాలి. అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. – రాయల ప్రభాకర్ రావు,
అడిషనల్ డీసీపీ (అడ్మిన్), వరంగల్ కమిషనరేట్
పట్టుదలతో కృషి చేస్తే విజయం
ఉద్యోగాల నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబెక్ట్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. చదివిన ప్రతీ అంశాన్ని బిట్ బ్యాంక్‌ల ద్వారా ప్రాక్టీస్ చేయాలి. మీ విజయం మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి వచ్చిన నోటిఫికేషన్‌లో సివిల్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం. – మల్లోజు సత్యనారాయణ చారి, కోచింగ్ నిపుణుడు, హనుమకొండ
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 656
ములుగుకు ప్రాధాన్యం కింద
189 పోస్టులు..
మూడు జోన్లలో మరో 101 మందికి
అవకాశాలు


