తొర్రూరు: శిశువుకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లి పాలు తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగం, అనారోగ్య సమస్యలు, సౌందర్యంపై మక్కువతో కొందరు తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. పలు అపోహల వల్ల చాలా మంది తల్లులు పిల్లలకు బయటి పాలు పట్టిస్తుంటారు. దీంతో పిల్లల్లో పూర్తిస్థాయిలో రోగ నిరోధక శక్తి లేక తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏటా ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది.
ఎందుకు ప్రాధాన్యం అంటే..
తల్లిపాలు బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు, గుండె, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. తల్లి పాలు అందకుంటే చిన్నారులు న్యుమోనియా, అతిసారం వంటి వ్యాధులతో పాటు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలు ఇవ్వకుంటే తల్లుల్లో కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని అవగాహన కల్పిస్తున్నారు.
తల్లికి ఎంతో మేలు..
● చనుబాలు పట్టే తల్లులకు కేలరీలు కాస్త ఎక్కువగా ఖర్చవుతాయి. పాలిచ్చేటప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్.. గర్భసంచి పూర్వ స్థితికి రావడానికి, కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గడానికి దోహదపడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గుతారు.
● రొమ్ము క్యాన్సర్ ముప్పు 28 శాతం, అధిక రక్తపోటు ముప్పు 11 శాతం, షుగర్ తలెత్తే ప్రమాదం 26 శాతం చొప్పున తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చేపట్టే కార్యక్రమాలివి..
● ప్రతీ గ్రామం, వార్డుల్లో పాలిచ్చే తల్లులకు కౌన్సెలింగ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన
● ఆస్పత్రులను సందర్శించి శిశువు పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టేలా అవగాహన కల్పించడం, ఆస్పత్రులు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో వాల్ పోస్టర్లు అతికించడం
● పని ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థల అధిపతులను చైతన్యపర్చడం
● అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలతో సమావేశాలు నిర్వహించడం
● పాలిచ్చే పద్ధతులు, చిన్నారుల బరువు, ఎదుగుదలపై అవగాహన
● అన్న ప్రాసనపై అవగాహన, అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సమయానికి అనుబంధ ఆహారం ప్రారంభించడం, రెండేళ్ల వరకు తల్లి పాలిచ్చేలా చైతన్య కార్యక్రమాలు
● 6 నుంచి 24 నెలల వయసున్న చిన్నారుల ఇళ్లను సందర్శించి తల్లి పాలతో పాటు ఆహారంపై అవగాహన కల్పించడం, ఆరు నెలల్లోపు చిన్నారులకు తల్లిపాల ఆవశ్యకతను వివరించడం


